Tuesday 9 July 2013

శ్రీరామాభిరామం (4/20/13)



 
భారతేతిహాసాలలో శ్రీరాముని విశిష్ట లక్షణాలను కొనియాడని ప్రబంధమూ లేదు. పరమ పురుషుడైన ఆ రవికులతిలకుడు చూపని ఉన్నత గుణమూ లేదు. సకల సద్గుణాల కలబోత జగదేక నేత శ్రీరాముడు. శ్రీరాముడు నీలమేఘశ్యాముడు. ధర్మవర్తనుడై సదా చరించటమే శ్రీరాముని ప్రకృతి. శ్రీరాముడు జగమెరిగిన మర్యాద పురుషోత్తముడు. శ్రీరాముడు సీతాపతిగా ఏకపత్నీవ్రతంతో చరించి విశ్వజన మార్గదర్శనం చేశాడు. ఒక భర్తగా చూపవలసిన లాలిత్యాన్ని, భార్యతో ఉండే సాన్నిహిత్యాన్నీ, జీవన మాధుర్యాన్నీ రాముడు చూపినంతగా మరెవ్వరూ చూపలేదంటే అతిశయోక్తి కాదు.

అభిరాముని విశిష్ట వ్యక్తిత్వం
రాముడు అంటేనే ఆనంద కారకుడు. అభిరాముడు అంటే అందం, ఆనందం, ధర్మనిరతి ఒకే చోట కూడితే అది రాముని విశిష్ట వ్యక్తిత్వం అవుతుంది. రాముడు సదా పూజనీయుడు.. అంటే ఒక విధంగా కాదు. సర్వ విధాలుగా..ప్రభువుగా మన్నిక గొన్నవాడు. రామరాజ్యంలో ప్రజలకు కష్టాలు, కడగండ్లు లేవు. రాఘవుడు భ్రాతృప్రేమను సోదరులకు ఎంతో ఆదరంతో పంచినవాడు. భర్తగా సీతమ్మకు హృదయాభరణమైనవాడు. పుత్రునిగా తండ్రియైన దశరథునకు ప్రియతముడు. 

ఇక, భక్తి సామ్రాజ్యంలో తనను ఆశ్రయించిన భాగవతోత్తములైన హనుమ వంటివారికి తన హృదిలో ఉన్నతమైన స్థానాన్ని సమకూర్చినవాడు. రామునిలో మెచ్చదగిన గుణాలు, ఎంచగలిగిన సుగుణాలు, ఒకటా, రెండా...రఘువంశ సుధాంబుధి చంద్రుడు.. ఎంచలేని ఉత్తమగుణ సంజాతుడు. అమిత బలపరాక్రముడైనా, అహంకార మన్నది మనకు రామయ్యలో ఎంత వెతికినా కనపడదు.


అవక్ర పరాక్రముడైనా, అకారణంగా మరొకరిపై రామయ్య తన కోదండాన్ని ప్రయోగించలేదు. మహర్షి విశ్వామిత్రుని యాగరక్షణలోనూ, జలధిపై వారధి నిర్మించే సమయాన రామునిలోని కార్యదక్షుడు మనకు దర్శనమిస్తాడు. ఎటువంటి ఆతృత, సందిగ్ధత శ్రీరామునిలో మచ్చుకైనా ఈ ఘట్టాలలో మనకు కానరావు. అందుకే రాముడు, వీరుడు, ధీరుడే కాదు, సారధర్మ కులోద్ధారుడు! ఉత్తమ ధర్మానికి నిలువుటెత్తు రూపంగా శ్రీహరి దశావతారాలలోనే గొప్పదైన రామావతారం వింతకాంతులీనింది. అందుకే "రామో విగ్రహవాన్ ధర్మః'' అన్న ఆర్యోక్తి మనకు నిత్యస్మరణీయమై నిలిచింది.


పితృవాక్యపరిపాలకుడు
శ్రీరాముని పితృవాక్యపరిపాలన అవనిలో అందరికీ శిరోధార్యంగా విరాజిల్లే మహోన్నత గుణం. తండ్రి యానతిని శిరసావహించి విశ్వామిత్రునితో యాగరక్షణకు వెళ్లిన రాముడు, మార్గమధ్యంలో తాటకను సంహరించమని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించినప్పుడు "గురువర్యా! మీ వాక్కులను త్రికరణ శుద్ధిగా పాటించమని మా జనకుని ఆజ్ఞ. మా తండ్రి ఆజ్ఞ మేరకు బ్రహ్మవాదులైన మీ ఆనతిని శిరసావహించి ఈ తాటకను తక్షణం వధించి మీకు ఆనందాన్ని కలిగిస్తాను'' అని చెప్పటంతోనే రాముడు తండ్రి మాటకు ఎంత గౌరవమిచ్చాడో మనకు అవగతమవుతుంది. 

దశరథుని సమక్షంలో తన పినతల్లి అయిన కైక తనకు దశరథుడిచ్చిన రెండు వరాలను గురించి ప్రస్తావించినప్పుడు శ్రీరాముడు పలికిన మాటలు శ్రీరాముని ఉన్నత హృదయానికి, ఉదాత్త చరితానికి అద్దం పడతాయి. శ్రీరాముడు ఆ సందర్భంలో కైకతో "అమ్మా! నాకు ఏమాత్రం రాజ్యకాంక్ష లేదు. నేను అయోధ్యలోనే ఉండి రాచమర్యాదలు పొందాలనీ ఆశించటం లేదు.


కేవలం ధర్మాన్నే ఆశ్రయించిన నన్ను ఋషితుల్యునిగానే పరిగణించవలసిందిగా నా ప్రార్థన. తల్లిదండ్రులకు శుశ్రూష చేయటం, వారి ఆజ్ఞలను హృదయపూర్వకంగా పాటించటాన్ని మించిన ప్రశస్తమైన ధర్మాచరణం పుత్రులకు ఈ భూలోకంలో లేనే లేదు కదా'' అన్న మాటలతో శ్రీరాముని ఉన్నత వ్యక్తిత్వంలోని అమృతత్వం వెల్లడవుతుంది. తన తమ్ముళ్ళైన భరతలక్ష్మణశతృఘ్నుల పట్ల శ్రీరామునికి అమితమైన సోదర ప్రేమ. శ్రీరాముడు కైకకు మాట ఇచ్చి "అమ్మా! నేను వనవాసాలకు వెళ్లేందుకు ఇచ్చిన మాట తప్పను.


భరతుని కోసం నేను రాజ్యాన్ని, సమస్త సంపదలను, చివరికి అత్యంత ప్రీతికరమైన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సంసిద్ధుడిగా ఉన్నాను'' అని పలకటం శ్రీరాముని సోదర ప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది. చిత్రకూట పర్వతానికి సైన్యంతో కలిసి వస్తున్న భరతుణ్ణి చూసి ఆగ్రహించిన లక్ష్మణునితో "ఓ లక్ష్మణా! భరతున్ని నీవు కోపంతో ఎటువంటి మాటలు అనవద్దు. ఒకవేళ నీవు అతనిపై ఆగ్రహిస్తే, నాపైనే నీవు కోపగించినట్లుగా భావిస్తాను'' అనటం శ్రీరాముని అపారమైన సోదర ప్రేమకు మచ్చుతునక


. అంతేగాక, యుద్ధ రంగంలో మూర్చిల్లిన లక్ష్మణుని చూసి చిన్న పిల్లవాడిలా రాముడు విలపించిన విధం సోదరులంటే రామునికి పంచప్రాణాలు అన్న విషయాన్ని బలపరుస్తుంది. ధర్మ నిరతికి ఉత్కృష్ట ఉదాహరణం శ్రీరాముని దివ్యచరితం! పుణ్యజీవనులకు ముదావహమైన ఆ గాధ స్మరణీయం సతతం! కమనీయమైనది లోకాభిరాముని అద్వితీయ వ్యక్తిత్వ దర్శనం! అది ఈ ధరణి నిలిచి ఉన్నంతవరకూ ఉజ్జ్వలంగా ప్రకాశించే విశిష్ట గుణాదర్శనం
!
   
 
 

No comments:

Post a Comment