Tuesday, 9 July 2013

అంతా రామ మయం ( 4/20/13)

శ్రీరామ నవమినాడు దేశ విదేశాల భక్తులంతా భద్రాచలం చేరుకుంటారు. సీతారాముల కల్యాణోత్సవం కనులారా వీక్షించాలని తపిస్తారు. అలాంటి రాముని సేవలో తరిస్తున్న భద్రాద్రి దేవస్థానాచార్యులు కొమాండూర్ ఇళైయవిల్లి స్థలశాయి, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తమ అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు..
12 సంవత్సరాల పుణ్యకాలం

- కొమాండూర్ ఇళైయవిల్లి స్థలశాయి, భద్రాద్రి దేవస్థానం స్థానాచార్యులు
"అటు గోదారి తల్లినీ, ఇటు జగదభి రామున్నీ చూసి తరించడం మొదలై దశాబ్దంపైగానే గడచింది. నిర్వ్యాజమైన స్వామి కటాక్షంతో 2001 అక్టోబరు 25వ తేదీ నుంచి స్థానాచార్యులుగా స్వామి సేవకై నియమితమయ్యాను. 2002 నుంచి శ్రీరామ నవమి ఉత్సవంలో జరిగే సీతారాముల కల్యాణంలో పాల్గొంటున్నాను. కల్యాణోత్సవంలో భాగస్వామ్యం వహించడం నిజంగా ఎంతో అదృష్టం. శ్రీరామ నవమినాడు ఆ శ్రీరామచంద్ర ప్రభువే ఈ క్షేత్రాన్ని ఆవహించాడేమో అనే అనుభూతి కలుగుతుంటుంది నాకు.

ఆధ్యాత్మిక ధామం...

అనేక వేల సంవత్సరాలు భద్ర మహర్షి చేసిన తపస్సుకు ఫలంగా వైకుంఠ నా«థుడైన శ్రీమన్నారాయణుడు రామచంద్ర మహాప్రభువుగా, స్వయంభువుగా వెలసిన పుణ్యక్షేత్రం భద్రాచలం. ఈ రాముని సన్నిధి ఒక ఆధ్యాత్మిక ధామం. ఇంద్రాది దేవతలతో, దేవర్షి నారదునిచే పూజలందుకున్నాడు భద్రాద్రి రాముడు. పోకల దమ్మక్క అనే ఒక ఆదివాసీ భక్తురాలికి పుట్టలో దర్శనమిచ్చాడు. గొప్ప వాగ్గేయకారుడు, మహా భక్తుడైన భక్త రామదాసు నిర్మించిన ఈ ఆలయంలో కొలువై అందరికీ దర్శనమిచ్చే మహా భాగ్యాన్ని ప్రసాదించిన భక్త వరదుడీ రామచంద్రుడు. అందుకే ఇక్కడ ఏటా జరిగే కల్యాణోత్సవం నిత్యనూతనంగా అనిపిస్తుంటుంది. సీతారాములిద్దరూ తమ కల్యాణాన్ని ప్రత్యక్షంగా తామే జరిపించుకుంటున్నట్లుగా అనిపిస్తుంది.

ఇక్కడి నుంచే ఆరంభం...
దేశ వ్యాప్తంగా ఎన్నో శ్రీరామక్షేత్రాలున్నా.. ఇతర రాష్ట్రాల్లోని కొన్ని రామాలయాల్లో నవమి నాడు సీతారాముల కల్యాణం జరిపించే ఆచారం లేదు. భద్రాచలంలో జరిగే కల్యాణోత్సవం ఎప్పుడయితే మీడియా ద్వారా ప్రచారం పొందిందో అప్పటి నుంచే ఇతర రామాలయాల్లో సీతారాముల కళ్యాణం ఆరంభమయింది. ఆ కళ్యాణోత్సవం భద్రాద్రిని పోలి ఉండేలా చూసుకుంటున్నారు. అంతేకాదు ఇక్కడి మాదిరిగానే శ్రీరామ నవమినాడే ఆ ఉత్సవాన్ని జరిపించుకునే పద్ధతీ అలవాటు చేసుకున్నారు.

అజరామం..ప్రామాణికం

ఇప్పటి వరకు నేను దక్షిణాదిన ఉన్న అన్ని రామాలయాలను దర్శించుకున్నాను. అలాగే అక్కడక్కడ జరిగే కల్యాణోత్సవాలను కూడా చూశాను. పాల్గొన్నాను. కాని ఈ క్షేత్రంలో జరిగే కల్యాణోత్సవమే గొప్ప ఆధ్యాత్మికానుభూతిని కలిగించింది. ఈ క్షేత్రంలోని కల్యాణోత్సవ ప్రక్రియే చాలా ప్రామాణికమైనదిగా నాకు అనిపిస్తుంటుంది. కొన్ని వందల ఏళ్లుగా నిరాటంకంగా, పాంచరాత్రగమశాస్త్ర బద్ధంగా సీతారామ కళ్యాణం ఇక్కడ జరుగుతోంది. 2011లో జరిగిన పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం, అప్పుడు దేవస్థానం నిర్వహించిన శ్రీరామ క్రతువు భద్రాచల క్షేత్ర చరిత్రలోనే గొప్పవి. సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం జరిగిన తర్వాత పట్టాభిషేకోత్సవ ప్రాశస్త్ర్యం కూడా పెరిగింది. మన రాష్ట్రం, ఇతర రాష్ట్రాల్లోని కొన్ని రామాలయాల్లో ఇక్కడి నుంచి అర్చక స్వాములను పిలిపించుకొని పట్టాభిషేకోత్సవాలు, కల్యాణోత్సవాలను జరిపించుకుంటున్నారంటేనే భద్రాద్రి గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.

ఆనందసమయం...

సామ్రాజ్య పట్టాభిషేకోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ముఖ్యంగా పట్టాభిషేకోత్సవం శ్రీరామునికి మాత్రమే చేసుకునే ఒక గొప్ప సేవ. ఈ సేవను ఇంకా బాగా విస్తరింపజేయవలసిన అవసరం ఉంది. దీనిని ఎంత వైభవంగా జరిపితే మన రాష్ట్రం అంత సుభిక్షంగా ఉంటుందని నా విశ్వాసం. అయితే ఈ మధ్య మాత్రం కల్యాణోత్సవాల విషయంలో సంప్రదాయేతరుల జోక్యం పెరడంపై బాధ కలుగుతోంది. పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాలకు సంబంధించిన ఒక సావనీర్‌ను విడుదల చేయాలనుకున్నాం. సావనీర్ కమిటీలోని ఐదుగురు సభ్యుల్లో నేనొకడిని. అయితే కొన్ని కారణాల వల్ల సావనీర్ విడుదల చేయలేకపోయాం. దీన్ని ఒక లోపంగా భావిస్తున్నాను. గోదావరి నదీ స్నానం, భద్రాచల దర్శనం, శ్రీరామసేవ... ఇంతకంటే ఈ జీవితానికి కావలసింది ఇంకేముంది?''

పూర్వజన్మ సుకృతం
- పొడిచేటి జగన్నాథాచార్యులు,
భద్రాద్రి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు
కంచర్ల గోపన్న రామాలయాన్ని నిర్మించాక పూజా కార్యక్రమాలు చేసేందుకు తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం నుంచి ఐదు కుటుంబాల వారిని తీసుకువచ్చారట. తూరుగోటి, కోటి, అమరవాది, గొట్టుపుళ్ల, పొడిచేటి కుటుంబాల వారు అందులో ఉన్నారు. అలా భద్రాద్రి చేరుకున్న వారిలో మాది పొడిచేటి వంశం. మా తాతల కాలం నుంచి మిరాశిల వ్యవస్థ అమల్లో ఉంది. మా నాన్న గారు పొడిచేటి శేషాచార్యులు 82 ఏళ్ల వరకు అర్చకత్వ బాధ్యతలు నిర్వహించారు. 1968 నుంచి 1972 వరకు నేను ఆలయంలో అర్చకునిగా పని చేశాను. అనంతరం నన్ను దేవాదాయ శాఖలోకి రెగ్యులర్ ఉద్యోగిగా తీసుకున్నారు.

వారధికి బీజం...

ఏటా చైత్రశుద్ద నవమి నాడు శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నారు. ఇందులో నాకు అర్చకునిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం లభించడం పూర్వ జన్మసుకృతంగా భావిస్తా. ఇప్పటి వరకు సుమారు 30కి పైగా కల్యాణాల్లో పాల్గొన్నాను. తొలి నాళ్లలో భద్రాద్రిలో రామయ్య కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పడవలు, లాంచీల పై వచ్చేవారు. నాకు పదేళ్ల వయసు ఉన్నపుడు శ్రీరామ కల్యాణం చూడటానికి పడవలపై వచ్చిన జనం గోదావరిలో మునిగిపోయి చచ్చిపోయారు. ఆ ప్రమాదంలో వందలాది మంది మృతి చెందడంతో గోదావరిపై భద్రాచలం వద్ద వారధికి పునాది రాయి పడింది.

మరపురాని జ్ఞాపకాలు...

60 ఏళ్లకోసారి నిర్వహించే మహాసామ్రాజ్య పట్టాభిషేకం 1987లో జరిగింది. దానిని నేను ఎన్నటికీ మరిచిపోలేను. అలాగే 2011లో జరిగిన శ్రీరామ పట్టాభిషేకం చూసినపుడు కూడా ఆ రాముడే దిగివచ్చాడేమో అన్న అనుభూతి కలిగింది. ఆ రోజు ఇసుక వేస్తే రాలనంతమంది భక్తులు భద్రాద్రి పురవీధుల్లో దర్శనమిచ్చారు. అయితే తొలినాళ్లలో కల్యాణం నిర్వహించిన పరిస్థితులకు నేటికీ ఎన్నో మార్పులు వచ్చాయి. తొలుత రామదాసు నిర్మించిన యాగశాల పై భాగంలో కల్యాణ మండపం ఉండేది. అక్కడ కల్యాణం నిర్వహించేవారు. అప్పట్లో స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు వెయ్యి మందే వచ్చేవారు. 

కాలక్రమేణా భక్తుల రాక పెరగడంతో చిత్రకూట మండపం ఎదురుగా డబుల్ మండపంలో కల్యాణం నిర్వహించారు. ఆ తరువాత 1964లో ఏప్రిల్ 6న నీలం సంజీవరెడ్డి ఆరంభించిన కళ్యాణ మండపంలో కళ్యాణోత్సవం మొదలు పెట్టారు. అప్పటి నుంచీ అక్కడే ఈ వేడుక కొనసాగుతోంది. నేను ప్రధాన అర్చకునిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇది రెండో కల్యాణం. భారతం, రామాయణం, భాగవతం, పాంచరాత్రగమం, ఇతిహాసాలు, పురాణాలు, దివ్య ప్రబంధాలు పఠించేందుకు పండితులు భద్రాద్రికి చేరుకోవాలనీ, అది ఒక సంప్రదాయంగా కొనసాగితే చూడాలనేది నా కల.




                   
 

No comments:

Post a Comment